Latest Navel Updates

Sunday, 30 June 2013

తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం : జానా రెడ్డి !

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాడిన తర్వాత విచక్షణకు గురైందని, ఒప్పందాల ఉల్లంఘన జరిగిందని సంఘాలు, సంస్థలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాల్ని చేపట్టాయని రాష్ట్రమంత్రి జానారెడ్డి అన్నారు. నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన ‘తెలంగాణ సాధన సభ’లో జానారెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరవీరులకు జోహార్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం గత 57 సంవత్సరాల నుంచి జరుగుతోంది అని జానా అన్నారు. 1956 నుంచి కొండా వెంకట రంగారెడ్డి, చెన్నారెడ్డి, ఇంద్రారెడ్డిలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశారన్నారు. శాసన మండలి, శాసన సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తీర్మానం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని జానా అన్నారు. 

తెలంగాణ కోసం పార్టీ అధిష్టానాన్ని ఎదరించిడానికి కూడా వెనుకాడలేదని.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, కుటుంబం లాంటి పార్టీతో తన సన్నిహితులు విభేధించారని జానా తెలిపారు. ప్రజల ఆకాంక్ష, నాయకుల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త్వరలో జరుగుతుందని ఆయన విశ్వాసం ప్రకటించారు. 

పది జిల్లాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చే రోజు తొందర్లోనే ఉందని, అనేక రాష్ట్రాలను ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని.. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కూడా సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటుందని జానా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుస్థిరతకు మారుపేరుగా నిలుస్తుందని, దేశంలోనే ఓ మోడల్ గా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని జానా ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకోవద్దని.. యువత నిస్పృహకు లోనుకావోద్దని.. త్వరలోనే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందనే హామీని జానా ఇచ్చారు. ఈ సభ ఏర్పాటు రాజకీయ లబ్దికోసం కాదని.. తెలంగాణ సాధన కోసమేనని జానా తెలిపారు. తెలంగాణ కోసం పదవుల త్యాగానికైనా సిద్ధం అని.. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీట్లు ఎవరికిచ్చినా గెలిపిస్తాం అని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాటం కొనసాగిస్తునే ఉంటామన్నారు.

Tags: Telugu News, Andhra News, News

No comments:

Post a Comment